2030 నాటికి భారతీయులు ఎక్కువగా ఖర్చు చేసేది వీటి కోసమేనట!

  • 2030 నాటికి అనుభవాలపై ఖర్చు మరింత పెరిగే అవకాశం
  • ట్రావెల్‌, హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ప్రాధాన్యం
  • వస్తువుల కంటే అనుభవాలపై ఎక్కువ ఆసక్తి
  • హోటల్ ఖర్చులు 10.6% వృద్ధితో పెరిగే అంచనా
  • జెన్‌జీ తరం ఈ మార్పుకు ప్రధాన కారణం
ఒకప్పుడు కొత్త ఫోన్, టీవీ, ఫర్నీచర్ కొనడం అనేవి ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మాత్రం చాలామంది డబ్బును వస్తువుల కంటే అనుభవాల కోసం ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. రాబోయే ఐదేళ్లలో ఈ ధోరణి మరింత బలపడనుందని రియల్ ఎస్టేట్ సేవలు, పెట్టుబడుల సంస్థ సీబీఆర్‌ఈ రీసెర్చ్ అధ్యయనం చెబుతోంది. 2030 నాటికి భారతీయులు వస్తువుల కంటే అనుభవాలపైనే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

ప్రయాణాలకే పెద్ద పీట
ఈ నివేదిక ప్రకారం 2025-2030 మధ్య కాలంలో భారతీయుల అనుభవాలపై (ఎక్స్‌పీరియెన్సెస్‌) ఖర్చు వేగంగా పెరగనుంది. వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, పర్యటనలపై వ్యయం వార్షికంగా 10.3 శాతం వృద్ధి రేటుతో పెరుగుతుందని అంచనా వేసింది. ఇక భౌతిక వస్తువులపై ఖర్చు 9.1 శాతం వృద్ధి రేటుతో పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హోటల్ వసతి ఖర్చులు 10.6 శాతం వృద్ధితో మరింత వేగంగా పెరుగుతాయని నివేదిక పేర్కొంది.

జెన్‌జీ ప్రభావం
ఈ మార్పునకు ప్రధాన కారణం జెన్‌జీ తరమేనని నివేదిక వెల్లడించింది. సోషల్ మీడియాలో పంచుకునేలా ప్రత్యేక అనుభవాలు, ఆకర్షణీయమైన ప్రదేశాలు, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే హోటళ్లకు యువత ప్రాధాన్యం ఇస్తోంది. సాధారణ వసతి కంటే ప్రత్యేక అనుభూతిని అందించే లైఫ్‌స్టైల్ హోటళ్లకు డిమాండ్ పెరుగుతోంది. వైన్ టేస్టింగ్‌, సంగీత కార్యక్రమాలు, స్థానిక కళా ప్రదర్శనల వంటి కార్యక్రమాలు నిర్వహించే హోటళ్లను యువ పర్యాటకులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

కొత్త ట్రెండ్‌గా లైఫ్‌స్టైల్ హోటళ్లు
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 2015 నుంచి 2025 మధ్య మొత్తం హోటళ్ల సంఖ్య 5 శాతం వృద్ధి రేటుతో పెరిగితే, లైఫ్‌స్టైల్ హోటళ్లు 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2030 వరకు కూడా ఈ విభాగం వేగంగా విస్తరించే అవకాశముందని నివేదిక తెలిపింది. భారత్‌లో ఈ తరహా హోటళ్ల సంఖ్య ఇంకా తక్కువగానే ఉండటంతో పెట్టుబడిదారులు, డెవలపర్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. ఇప్పటికే ఉన్న హోటళ్లను ఆధునిక లైఫ్‌స్టైల్ హోటళ్లుగా మార్చే ధోరణి కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

Indian Consumers
CBRE Research
Experience Economy
Gen Z Spending Habits
Lifestyle Hotels India
Travel and Tourism Growth

More Telugu News